రివ్యూ : అరవింద సమేత

చిత్రం : అరవింద సమేత (2018)

నటీనటులు : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, ఈషా రెబ్బా

సంగీతం : థమన్

దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

నిర్మాత : రాధాకృష్ణ

రిలీజ్ డేటు : 11అక్టోబర్, 2018.

రేటింగ్ : 3.5/5

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తారక్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాలి. కానీ, అంతకంటే ముందు ‘అజ్ఝాతవాసి’ ప్లాప్ గుర్తొచ్చి కలవరపడిపోయారు అభిమానులు. ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్, టీజర్ తో ఆ అనుమానాలు పటాపంచలైపోయాయి. త్రివిక్రమ్ పూర్తిగా తారక్ దారిలోకి వచ్చి చేసిన సినిమా అని అర్థమైపోయింది.

ఇక, అప్పటి నుంచి త్రివిక్రమ్ ఒరలో తారక్ ఎలా ఇమిడాడు అనేది చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన పాటలు, ట్రైలర్, సాంగ్ ప్రోమోలు సినిమాపై అంచనాలని ఆకాశాన్నింటేలా చేశాయి. ఇలాంటి భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ‘అరవింద సమేత వీర రాఘవ’డు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. మరీ.. వీర రాఘవుడు ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

నల్లగుడి గ్రామ పెద్ద బాసి రెడ్డి (జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఈ రెండు గ్రామాలు ఫ్యాక్షన్ గొడవలతో రగిలిపోతుంటాయి. ఎప్పుడో ఓ చిన్ని గొడవతో ఈ రెండు గ్రామాల మధ్య చిచ్చు రాజుకుంది. అది కొనసాగుతూనే ఉంది. ఐతే, ఈ గొడవలకి దూరంగా నారప రెడ్డి తన కొడుకు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్‌)ని లండన్ లో పెంచుతాడు. ఓ సందర్భంలో లండన్ నుంచి వచ్చిన కొడుకు వీర రాఘవ రెడ్డిని ఇంటికి తీసుకొస్తుండగా నారప రెడ్డిని ప్రత్యర్థులు చంపేస్తారు.

అయినప్పటికీ.. ఫ్యాక్షన్ గొడవలకి దూరంగా ఉండాలని వీర రాఘవరెడ్డి హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడ పరిచయమైన అరవింద (పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ఆమె సాయంతో ఊర్లో ఫ్యాక్షన్ గొడవలని ఆపాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయాణంలో వీర రాఘవుడి ఎదురైన సమస్యలేంటీ ? ఇంతకీ ఆ ఊర్లతో అరవిందకి ఉన్న అనుబంధం ఏమిటీ.. ? ఫైనల్ గా ఆ రెండు ఊర్ల మధ్య ఫ్యాక్షన్ కి పులిస్టాప్ పడిందా.. ?? అనేది త్రివిక్రమ్ మార్క్ కథనంతో కూడిన మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* నేపథ్య సంగీతం

* ఎన్టీఆర్, జగపతి బాబుల నటన

* కథనం, మాటలు

మైనస్ పాయింట్స్ :

* పెద్దగా ఏమీలేవు. ఒకట్రెండు బోరింగ్ సీన్స్ తప్ప.

ఎలా ఉందంటే ?

తెలుగు తెరపై బోలేడు ఫ్యాక్షన్ కథలొచ్చాయ్. ఇంతకుముందు తారక్ చాలాసార్లు కత్తిపట్టినోడే. రాయలసీమ పౌరుషం చూపించినోడే. ఇది కూడా ఓ ఫ్యాక్షన్ కథే. అలా అని సినిమా మొత్తం యాక్షన్ ఏపీసోడ్స్ తో నింపేయలేదు. ఫ్యాక్షన్ గొడవలతో సినిమాని మొదలెట్టి.. దాన్ని పీక్స్ లో చూపించాడు. ఎంతలా అంటే.. రక్తంతో తడిసిన కత్తిని తారక్ తన తొడకి తూడ్చుకొనేంతగా. ఇలాంటి ఆలోచన ఊరమాస్ దర్శకుడు బోయపాటికి కూడా రాలేదు. తొడగొట్టడం పాత ట్రెండు.. ఇది కొత్త ట్రెండు అన్నమాట.

ఇక ఎన్టీఆర్ తో సినిమా, అది కూడా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో. అనగానే అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్‌ మార్క్‌ డైలాగ్స్‌, ఎమోషన్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ మిస్ కాలేదు. కాకపోతే.. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే ఎంటర్ టైనర్ డోస్ ఇందులో లేదు. బహుశా.. అది కథని అడ్డువస్తుందని తగ్గించుకొని ఉంటాడు.

ఫ్యాక్షన్ గొడవలతో మొదలెట్టి.. దాన్ని పీక్స్ లో చూపించి.. దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేయడం. అది కూడా హీరో. ప్రత్యర్థులు ఊరిస్తున్న, ఒంట్లో రక్తం ఉరకలేస్తున్న. ఆగి, అదుపు చేసుకొని గొడవలు ఆపడం మాములు విషయం కాదు. ఆ కథని చాలా గ్రిప్పింగ్ గా, కన్విన్సింగా చెప్పాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ అదే చేశాడు. ఏం చెప్పాడ్రా బాబు. ఏం చూపించాడ్రా బాబు అన్నట్టుగా ఉంది. త్రివిక్రమ్, తారక్ ఫ్యాన్స్ ఇద్దరినీ మెప్పించేలా అరవింద సమేతని అద్భుతంగా డీల్ చేశాడు గురూజీ.

ఎవరెలా చేశారంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో అందరికీ తెలుసు. సినిమా మొత్తం తన భుజాల వేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ చేయగల సత్తా ఉన్న కథానాయకుడు. ఇందులోనూ ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. రాయలసీమ యాసలో తారక్ డైలాగ్స్‌ అదుర్స్. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తారక్ నోటీతో చెబుతుంటే అద్భుతంగా అనిపిస్తాయి.

ఇక, పూజా హెగ్డే అందంగా, క్యూట్ గా కనిపించింది. ఆమెకి పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు. కానీ, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ ఈషా దెబ్బ ఉన్నంతలో ఆకట్టుకొంది. ఇక, ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకొనే పాత్ర జగపతిబాబు. లుక్స్ తో భయపెట్టాడు బాబు. తారక్ తండ్రి పాత్రలో నాగబాబు నటన బాగుంది.

సాంకేతికంగా :

ఈ సినిమా క్రిడిట్ తారక్, త్రివిక్రమ్ లతో సమానంగా థమన్ కి దక్కుతుంది. ఆయన అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. అంతకుమించి నేపథ్య సంగీతం ఉంది. అది సినిమా స్టాయిని మరింతగా పెంచింది. పీఎస్‌ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : అరవింద సమేత ‘వీర రాఘవు‘డి అరాచకం అద్భుతం

రేటింగ్ : 3.5/5