చంద్రబాబుని పట్టిస్తే రూ. లక్ష బహుమతి !

వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఈ ఆఫర్ ని ప్రకటించింది ఎవరో తెలుసా ? వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా, వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు. ఏదో హోటల్ లో భోజనాలు వడ్డిస్తున్నారు.

‘ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా ? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఎవరికైనా తెలిస్తే Laksmisntr@gmail.com మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చంద్రబాబుని పట్టిస్తే రూ.లక్ష బహుమతి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ.. చంద్రబాబుని పట్టించే ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి.

ఇక, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పట్టాలెక్కించబోతున్నట్టు వర్మ తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతీ ప్రవేశించిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. దసరా పండగ రోజున (అక్టోబర్ 18)న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఆ మరుసటి రోజు వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న అనంతరం ఈ సినిమా విశేషాలని మీడియోతో పంచుకొన్నారు. వచ్చే యేడాది జనవరిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.