రివ్యూ : హలో గురు ప్రేమకోసమే


చిత్రం : హలో గురు ప్రేమకోసమే

నటీనటులు : రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత

దర్శకత్వం : త్రినాథరావు నక్కిన

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత : దిల్ రాజు

రిలీజ్ డేటు : 18 అక్టోబర్, 2018.

రేటింగ్ : 3/5

సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు త్రినాథరావు నక్కిన. ఇతడి టేకింగ్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఆయన ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేసిన చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్. దిల్ రాజు నిర్మాత. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ దసరా కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. రామ్ ప్రేమకోసం ఏం చేశాడు ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

సంజు ( రామ్) కాకినాడకు చెందిన కుర్రాడు. ఫ్రెండ్స్ విడిపోతే ఎప్పటికైనా మళ్లీ కలవొచ్చు, నిజమైన ప్రేమికులు విడిపోతే జీవితంలో కలవలేరు అని వాదించే రకం. అది నమ్మే ఇంట్లో ఒప్పించి ప్రేమించిన వ్యక్తితో తన చెల్లి పెళ్లి చేస్తాడు. హైదరాబాద్ లో అమ్మ స్నేహితుడైన విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో వుంటూ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ కమంలో సంజు-విశ్వనాథం మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఐతే, వాళ్ల ఇంటికి రాకముందే ట్రైన్లో కలిసిన విశ్వానాథం కూతురు అనుపమను చూసి ప్రేమలో పడతాడు.

ఈ విషయం అనుపమకు, ఆమె తండ్రి విశ్వనాథంకు చెప్పేలోపే.. ఆమెకు వేరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈ విషయాన్ని ఒక ఫ్రెండుగా తన మనసులో అనుపమ ఉన్న విషయాన్ని విశ్వనాథంకు చెబుతాడు సంజు. ఆ అమ్మాయి తన కూతురు అని తెలియక ముందు నీ ప్రేమకు హెల్ప్ చేస్తానని ఒక ఫ్రెండుగా చెప్పిన విశ్వనాథం, ఆ అమ్మాయి తన కూతురే అని తెలిసిన తర్వాత తండ్రిగా ఎలా రియాక్ట్ అయ్యాడు ? అన్నది మిగితా కథ.

ఎలా ఉందంటే ?

కథలో కొత్తదనం లేనప్పుడు.. కథనంతో కట్టిపడేయాలి. అది త్రినాథరావుకు బాగా తెలుసు. ఆయన గత చిత్రాలు సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ సినిమాల కోసం అదే చేశాడు. హలో గురూ.. కోసం అదే చేశాడు. అయినా.. సినిమా గ్రిప్పింగ్ గా సాగలే. కథలో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోయింది. దానికి తోడు కామెడీ, ఎమోషనల్ సీన్ పక్కగా కుదరలేదు. అలాగాని సినిమాలో ఏం లేదని తీసేయలేం. ప్రేక్షకుడు సరదాగా ఓసారి చూసే సినిమా. రామ్ ముందే చెప్పినట్టుగా కథలో కొత్తదనం ఏమీ లేదు. టేకింగ్ మాత్రం త్రినాథరావు మార్క్ కనబడింది. దీంతో సినిమా యావరేజ్-హిట్ కి మధ్యలో మిగిలిపోయిందని చెప్పవచ్చు.

ఎవరేలా చేశారంటే ?

కథ మొత్తం రామ్, ప్రకాష్ రాజ్, అనుపమ పరమేశ్వరన్ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. వీరి నటన బాగుంది. రామ్ సెటిల్డ్ గా నటించాడు. లుక్స్ పరంగా బావున్నాడు. సంజు పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. అనుపమ పరమేశ్వరన్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా డీసెంట్ లుక్స్‌‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ ప్రణీత చిన్న పాత్రలో మెరిసింది. ఇక, ప్రకాష్ రాజ్ నటన సూపర్భ్. అటు తండ్రిగా కూతురు కోసం తపనపడే పాత్రలో, ఇటు సంజు ఫ్రెండుగా అతడికి హెల్ప్ చేసే పాత్రలో మెప్పించాడు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమా కోసం దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు అంతే ‘నేను శైలజా’ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకొన్నారు ప్రేక్షకులు. ఐతే, ఈసారి దేవి నిరాశపరిచాడు. సాదాసీదా పాటలు ఇచ్చాడు. నేపథ్య సంగీతంలో మాత్రం ఆయన మార్క్ కనబడింది. ఇక, విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమాలో కొన్ని చోట్ల సాగదీత అనిపించింది. కొన్ని సీన్స్ కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 3/5