ఎన్డీ తివారి ఇకలేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారి (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. రెండు రాష్ట్రాలకు ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత ఆయనది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు మూడు పర్యాయాలు 1976-77, 1984-85, 1988-8 సీఎం గా పని చేశారు. ఇక, 2002 నుంచి 2007 వరకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారు.

1925 అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌జిల్లా బాలూటి గ్రామంలో తివారి జన్మించారు. ఆయన పుట్టినరోజు నాడే మరణించడం గమనార్హం. 1994లో తివారి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అర్జున్‌సింగ్‌తో కలిసి ఆల్‌ ఇండియా ఇందిరా కాంగ్రెస్‌ స్థాపించారు. అనంతరం సోనియా గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా పరిశ్రమలు, పెట్రోలియం శాఖలకుమంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు.