హలో.. కేటీఆర్’కు నచ్చేసింది !

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కాస్త కళాపోషణ తెలుసు. ఆయన సినిమాలు బాగానే చూస్తుంటారు. వాటిపై ఆయన అభిప్రాయాన్ని పంచుకొంటుంటారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం, శేఖర్ కమ్ముల ‘ఫిదా’, మహేష్ బాబు శ్రీమంతుడు, భరత్ అను నేను.. తదితర సినిమాలపై కేటీఆర్ ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన రామ్ ‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమా వీక్షించారు. ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘ఎన్నికలతో బిజీగా ఉన్న తరుణంలో పండుగ వల్ల కాస్త విరామం దొరికి, ‘హలో గురు ప్రేమ కోసమే’ చూసే అవకాశం వచ్చింది. ఇది పూర్తి వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రం. రామ్‌, ప్రకాశ్‌రాజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ అద్భుతంగా నటించారు’ అని కితాబిచ్చారు కేటీఆర్. దసరా పండగరోజున (అక్టోబరు 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌ లభించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీలోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్. దిల్ రాజు నిర్మాత. ఇందులో ప్రకాష్ రాజ్ హీరోయిన్ అనుపమకి తండ్రిగా నటించారు. రామ్, అనుపమ, ప్రకాష్ రాజ్ లు సినిమాకు మూడు పిల్లర్లుగా నిలిచారని.. వారి నటన్ చాలా బాగుందని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా అదే చెప్పారు. హలో.. కేటీఆర్ కు నచ్చేయడం.. టీఆర్ ఎస్ శ్రేణులు ఈ సినిమాపై ఆసక్తిని చూపే అవకాశాలు ఉన్నాయి.