సిట్టింగులకు స్వీట్ వార్నింగ్ ?
ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. దసరా పండగ తర్వాత ప్రచారం జోరులో పెంచుతామని సీఎం కేసీఆర్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేశారు. అంతకంటే ముందే అభ్యర్థులకి ఎన్నికల ప్రచార వ్యూహంపై స్పష్టత ఇవ్వబోతున్నాడు కేసీఆర్. ఇందులో భాగంగా ఇవాళ 105 మంది అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వీరితో పాటు మిగిలిన 14 స్థానాలకు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఈ సమావేశానికి రానున్నారు.
ఈ సమావేశంలో అభ్యర్థులకి కేసీఆర్ పలు సూచనలు చేయబోతున్నారు. ముందుగా ఎన్నికల మేనిఫెస్టోపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు ఎన్నికల వ్యూహా రచనని వివరించనున్నారు. నియోకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులపై అభ్యర్థులకి మరింత సమాచారం ఇవ్వనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సూచనలు చేస్తూనే స్వీట్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు కేసీఆర్. దాదాపు 100 స్థానాలకు పైగా గెలుపే లక్ష్యంగా పెట్టుకొన్న టీఆర్ఎస్ అందుకు తగ్గట్టుగా అభ్యర్థులని ఎన్నికల ప్రచారానికి రెడీ చేస్తోంది. ఇంతకీ కేసీఆర్ అభ్యర్థులకి ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఏంటన్నది మరికొద్దిసేపట్లో తెలియనుంది.
మరోవైపు, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేసీఆర్ ని ఫాలో అవుతున్నారు. ఆయన ఇవాళ హైదరాబాద్ లో టీ-టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారంలో నేతలకి కీలక సూచనలు చేయనున్నారు. దీంతో పాటు.. మహాకూటమిలో టీడీపీ సాధించుకోవాల్సిన స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. మొత్తానికి.. చంద్రులిద్దరు ఒకే సమయంలో ఒకే పని చేయబోతున్నారన్న మాట.