సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ ఇకలేరు !

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకొంది. సీనియర్ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌ (75) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో మృతిచెందారు. వైజాగ్‌ ప్రసాద్‌ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద రావు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. సుమారు 700 నాటికల్లో నటించారు. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్‌, గరీబీ హఠావో లాంటి నాటికలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1983లో వచ్చిన బాబాయ్‌ అబ్బాయ్‌ నటుడిగా ఆయన మొదటి సినిమా. నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.

వైజాగ్‌ ప్రసాద్‌ కుమార్తె, కుమారులు అమెరికాలో ఉన్నారు. వారు రాగానే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రసాద్ మృతి పట్ల ‘మా’ సంతాపం తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు ప్రసాద్ కి సంతాపం తెలిపారు.