టీఆర్ఎస్ సెంచరీ ఖాయం
ముందస్తుకు వెళ్లిన టీఆర్ఎస్ వంద స్థానాలకు పైగా గెలుపే లక్ష్యంగా పెట్టుకొంది. మొదటి నుంచి సీఎం కేసీఆర్ 100 ఖాయమని చెబుతున్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో తెరాస అభ్యర్థుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో ఈసారి తెరాస ఘన విజయం ఖాయమని, సర్వేలా ఇదే చెబుతున్నాయని తెలిపారు కేసీఆర్.
ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తేనే తెలంగాణ బలం దేశానికి మరోసారి తెలుస్తుందన్నారు. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వం మాట వింటుందని చెప్పారు. సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో ఫలితాలను సాధించేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అలాగని అతివిశ్వాసం పనికిరాదని, గత ఎన్నికల్లో వైసీపీ అతివిశ్వాసం కారణంగానే ఓడిందని గుర్తు చేశారు కేసీఆర్.
మరో రెండు స్థానాలకు అభ్యర్థుల ఖరారు :
టీఆర్ఎస్ మరో ఇద్దరి అభ్యర్థుల టికెట్లను ఖరారు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా కె.మాణిక్‌రావు, మలక్‌పేటకు చావ సతీష్‌కుమార్ పేర్లను ఆదివారం రాత్రి ప్రకటించారు. జహీరాబాద్ టికెట్ కోసం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పోటీపడినా స్థానికుడనే కారణంతో మాణిక్‌రావు వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మాణిక్‌రావు గత ఎన్నికల్లో జహీరాబాద్ తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మరోవైపు మలక్‌పేటలో గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన సతీష్‌కే మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక, మిగిలిన 12 స్థానాలకు గానూ త్వరలోనే అభ్యర్థులని ప్రకటించనున్నారు.