విషాదం : నిర్మాత డి. శివ ప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి (62) మృతి చెందారు. ఆయన గతకొద్దికాలంగా గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స
పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

1985లో శివ ప్రసాద్ ‘కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌’ను స్థాపించారు. ఈ బ్యానర్ లో ‘కార్తీక పౌర్ణ‌మి’, ‘శ్రావ‌ణ సంధ్య’‌, ‘విక్కీ దాదా’, ‘ముఠా మేస్త్రి’, ‘అల్ల‌రి అల్లుడు’, ‘ఆటోడ్రైవ‌ర్’‌, ‘సీతారామ‌రాజు’, ‘ఎదురులేని మ‌నిషి’, ‘నేనున్నాను’, ‘బాస్‌’, ‘కింగ్’, ‘కేడీ’, ‘ర‌గ‌డ‌’, ‘ద‌డ‌’, ‘గ్రీకువీరుడు’ తదితర సినిమాల‌ను నిర్మించారు. కింగ్ నాగార్జునకి శివ ప్రసాద్ మంచి స్నేహితుడు. ఆయన ఎక్కువగా నాగ్ తోనే సినిమాలు చేశారు. శివ ప్రసాద్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.