లైంగిక వేధింపుల కేసులో అర్జున్ అరెస్ట్ ?


యాక్షన్ కింగ్ అర్జున్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా ? లైంగిక వేధింపుల కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారా.. ?? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అర్జున్ తనని లైంగికంగా వేధించాడని కన్నడ నటి శ్రుతీ హరిహరన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమిళ్, కన్నడ ద్విభాషా చిత్రం ‘నిబుణన్‌’ (కన్నడలో ‘విస్మయ’) సెట్స్‌లో నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారని తెలిపింది.

ఇప్పటివరకు వచ్చిన #మీటూ ఆరోపణలతో పోలిస్తే అర్జున్ పై రియాక్షన్ భిన్నంగా కనబడింది. అందరు అర్జున్ మంచోడు. అలాంటోడు కాదని కితాబిచ్చారు. సీనియర్ హీరోయిన్స్ ఖుష్భూ, రేవతి.. తదితరులు అర్జున్ కి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా శ్రుతి హరిహరన్ తగ్గలేదు. నా దగ్గర ఆధారాలున్నాయని గట్టిగా నిలబడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య రాజీకుర్చేందుకు సీనియర్ నటుడు అంబరీష్ రంగంలోకి దిగారు. మీటింగ్ ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

ఈ వ్యవహారాన్ని కోర్టులోనే చూసుకుంటామని అర్జున్, శ్రుతి హరిహరన్ ఇద్దరూ తెగేసి చెప్పేశారు. అన్నట్టుగానే అర్జున్ శ్రుతిపై రూ. 5కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇక శ్రుత్రి కూడా అర్జున్‌ను ఢీకొనడానికి సిద్ధమైంది. బెంగళూర్‌లోని కబ్బన్‌పార్క్‌ పోలీసులకు అర్జున్‌పై ఫిర్యాదు చేసింది. అందులో 2015లో ఒక చిత్రంలో నటిస్తుండగా అర్జున్ తనని లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. శ్రుతి ఫిర్యాదుతో అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అర్జున్ ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.