రివ్యూ : సవ్యసాచి

చిత్రం : సవ్యసాచి

నటీనటులు : నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్‌

సంగీతం : కీరవాణి

దర్శకత్వం : చ‌ందు మొండేటి

నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

రిలీజ్ డేటు : 02 నవంబర్, 2018.

రేటింగ్ : 2.75/5

తెలుగు హీరోలు వైవిధ్యం కోరుకొంటున్నారు. విభిన్నమైన కథలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోల కంటే యంగ్ హీరోలే ప్రయోగాలు చేసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. నిఖిల్, రానా దగ్గుపాటి, నాని, వరుణ్ తేజు.. తదితరులు విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకొన్నారు. ఇప్పుడీ లిస్టులో నాగ చైతన్య చేరిపోయాడు. ఆయన తాజా చిత్రం ‘సవ్యసాచి’. ‘ఎడమచేయి చెప్పిన మాట వినదు’ (లెఫ్ట్‌ హ్యాండ్‌ సిండ్రోమ్‌) అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. చందూ మొండేటి దర్శకుడు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ని ఓ ప్రయోగాత్మక చిత్రంలా కాకుండా పక్కా కమర్షియల్ సినిమాగా రెడీ చేశారు. మరీ.. అదెంత వర్కవుట్ అయ్యింది. అసలు సవ్యసాచి కథేంటీ ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటో తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ !

కథ :

విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌) వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు తీసే ఓ ద‌ర్శ‌కుడు. ఆరేళ్ల కింద‌ట కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక‌రికొకరు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలోనే దూర‌మ‌వుతారు. ఆరేళ్ల త‌ర్వాత అనుకోకుండా మ‌ళ్లీ క‌లుసుకుంటారు. విక్ర‌మ్ ఆదిత్య వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన వ్య‌క్తి. అత‌నిలో మ‌రో మ‌నిషి కూడా ఉంటాడు. భావోద్వేగానికి గురైనా, ఎక్కువ సంతోషం క‌లిగినా ఎడ‌మ చేతి వైపున ఉంటూ స్పందిస్తుంటాడు ఆ రెండో మ‌నిషి. ఒక‌రిలో ఇద్ద‌రున్నారు కాబ‌ట్టే త‌ల్లి ఒకరి పేరు విక్ర‌మ్‌గా, మ‌రొక‌రి పేరు ఆదిత్య‌గా పిలుస్తుంటుంది.

ప్రేయ‌సికి మ‌ళ్లీ ద‌గ్గ‌రై ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలోనే విక్ర‌మ్ ఆదిత్య అక్క శ్రీదేవి (భూమిక‌) ఇంట్లో బాంబు పేలుతుంది. బావ చ‌నిపోగా, త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన అక్క కూతురు మ‌హాల‌క్ష్మి కిడ్నాప్‌కి గుర‌వుతుంది. ఇంత‌కీ ఆ బాంబు పేలుడు వెన‌క ఎవ‌రున్నారు ? కిడ్నాప్‌కి గురైన అక్క కూతురు మహాల‌క్ష్మిని విక్ర‌మ్ ఆదిత్య ఎలా ర‌క్షించాడు ? ఎడ‌మ చేతిలో ఉన్న ఆదిత్య ఎలా సాయం చేశాడు ? ఈ క‌థ‌లో అరుణ్ (మాధ‌వ‌న్ ) ఎవ‌రు ? అనేది మిగితా కథ.

ఎలా ఉందంటే ?

దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ (ఒకే దేహంలో ఇద్దరు) అనే పాయింట్ కొత్తది. ఐతే, దాన్ని ప్రయోగాత్మక చిత్రంగా కాకుండా.. పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో తెరకెక్కించాలన్న ఆలోచన కూడా మంచిదే. ఆ ధ్యాసలో పడి కథని బలంగా చెప్పడంలో తడబాటు కనిపించింది. ఆసక్తికరమైన కథతో సినిమాని మొదలెట్టిన దర్శకుడు ఫస్టాఫ్ అంతా నటీనటుల పరిచయం, సరదా సరదా సన్నివేశాలతో లాగించేశాడు. సెకాంఢాఫ్ లో అసలు కథని రిలీఫ్ చేశాడు. బాంబు పేలుడు సంఘ‌ట‌న‌, అక్క కూతురు కిడ్నాప్ విష‌యం వెలుగులోకి వ‌చ్చాక సినిమా ఆసక్తికరంగా మారింది. ఐతే, హీరో-విలన్ ల మధ్య మైండ్ గేమ్ రొటీన్ గానే సాగింది. క్లైమాక్స్ ఆకట్టుకొనేలా ఉంది.

ఎవరెలా చేశారంటే ?

నాగ చైతన్య సినిమా సినిమాకి నటనలో పరిణితి చూపిస్తున్నారు. ఇందులోనూ చైతూ నటన ఓ మెట్టుఎక్కించేలా ఉంది. మాధవన్ నటన చాలా బాగుంది. ఆయన ఎంట్రీతో సినిమాపై ఆసక్తి పెరిగింది. చైతూ-మాధవన్ ల మధ్య మైండ్ గేమ్ ఇంకాస్త కొత్తగా డిజైన్ చేసుకొంటే ఇంకా బాగుండేది. హీరోయిన్ నిధి అగర్వాల్ అందంగా కనిపించింది. నటనతో ఆకట్టుకొనే స్కోప్ ఆమెకు లభించలేదు.
గ్లామర్ పాత్రలకు ఆమె మంచి ఆప్షన్ గా మారేలా అనిపించింది. భూమిక కనిపించేది కొద్దిసేపే. ఉన్నంతలో ఆకట్టుకొంది. వెన్నెల కిషోర్, సత్య.. కామెడీ బ్యాచ్ నవ్వులు పంచింది. మిగితా నటీనటులు తమ తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతికంగా :

కీరవాణి అందించిన పాటలు సాదాసీదాగా అనిపించినా.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకొన్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఈసారి చైతూ డ్యాన్సుల్లోనూ ఇరగదీయడం విశేషం. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ నిర్మాణ విలువలకు బాగున్నాయి.