షాక్ : ఆత్మహత్య ఆలోచనలతో రెహమాన్

ఎఆర్ రెహమాన్.. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు. రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు అందుకొన్న ప్రతిభాశాలి. సంగీత దర్శకుడు అవ్వాలనుకొనే ప్రతి ఒక్కరూ.. ఏఆర్ రెహమాన్ అంత స్థాయికి ఎదగాలని కలలు కంటుంటారు.

అలాంటి రెహమాన్ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ, ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా రెహమాన్ నే చెప్పారు. ఆయన జీవితాధారంగా కృష్ణ తిలోక్ రాసిన బయోగ్రఫీ ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహ్మాన్‌’ని శనివారం విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు.

రెహమాన్ కు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవట. దాదాపు 25యేళ్ల వయసు వరకు అలాంటి కలలు వచ్చాయి. తన తండ్రి మరణం తనలో భయాన్ని పోగొట్టిందని చెప్పుకొచ్చారు. తన అసలు పేరు దిలీప్. ఎందుకో ఆ పేరంటే తనకు నచ్చేది కాదు. తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహ్మాన్‌గా మారిందన్నారు. జీవితం ఎవరు తక్కువ చేసి చూసుకోవద్దని సూచించారు.

గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు రెహమాన్. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు. సినిమాల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన ‘యోధ’ సినిమాతో పరిచయం అయ్యాడు. మణిరత్నం ‘రోజా’ సినిమాతో రెహమాన్ పేరు మారుమ్రోగిపోయింది.