రివ్యూ : సర్కార్
చిత్రం : సర్కార్ (2018)
నటీనటులు : విజయ్, కీర్తి సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్
సంగీతం : ఏఆర్ రెహమాన్
దర్శకత్వం: మురుగదాస్
నిర్మాతలు : కళానిధి మారన్
రిలీజ్ డేటు : 6 నవంబర్, 2018
రేటింగ్ : 3.25/5
దర్శకుడు మురగదాస్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన సమాజంలోని ఓ కీలకాంశాన్ని కథగా తీసుకొని సటైర్స్ వేస్తుంటాడు. ఈసారి ఆయన రాజకీయాలని ఎంచుకొన్నాడు. విజయ్ తో కలిసి ‘సర్కార్’ సినిమా చేశాడు. ఇందులో ఒకరి ఓటును ఎవరైనా దొంగతనంగా వేసేస్తే ఆ హక్కును తిరిగి ఎలా సంపాదించుకోవచ్చు అని తెలియజేస్తూనే.. సమకాలిన రాజకీయాలపై సటైర్లు వేశాడు. అవి ఏ రేంజ్ లో ఉన్నాయి. లాజిక్ కు అందేలా ఉన్నాయా.. ? ప్రేక్షకులని మెప్పించాయా.. ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
సుందర్ రామస్వామి (విజయ్) అమెరికాలో ఒక పేరు మోసిన కంపెనీకి సీఈవో. ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ రంగంలో అతడో ‘ఛంఘీజ్ ఖాన్. ఇలాంటి ఇమేజ్ ఉన్న సుందర్ ఓటు వేయడానికి ఇండియాకి వస్తాడు. అప్పటికే అతడి ఓటును ఎవరో వేసేస్తారు. తన ఓటు తనకు కావాలని కోర్టుకెక్కుతాడు. రాజ్యాంగాన్ని, హక్కులను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం కూడా అతని ఓటును అతడికి తిరిగి ఇవ్వాలని తీర్పు ఇస్తుంది. ఈ తీర్పుతో తమ ఓటు తమకు కావాలని దాదాపు 3లక్షల మంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు.
దీంతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సిన పుణ్యమూర్తి (రాధా రవి) ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్నికలు రద్దవుతాయి. అంతేకాదు.. మరో 15రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు చెబుతుంది. ఆ ఎన్నికల్లో సుందర్ సీఎం అభ్యర్థిగా నిలబడాలని నిర్ణయం తీసుకొంటాడు. మరీ.. సుందర్ సీఎం అవుతాడా.. ? ఈ క్రమంలో ఆయన ఓటర్లని ఎలా చైతన్య పరిచాడనేది… సమకాలీన రాజకీయాలని టచ్ చేస్తూ సాగిన కథ ఇది.
ఎలా ఉందంటే ?
మురగదాస్ సామాజిక కోణంలో కథ రాసుకొన్నా.. దానికి కమర్షియల్ హంగులు అందుతుంటాడు. ‘సర్కార్’ ని కూడా పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో తీసుకొచ్చాడు. విజయ్ నుంచి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ జోడించారు. ఒక ఓటును ఎవరైనా దొంగతనంగా వేసేస్తే ఆ హక్కును తిరిగి సంపాదించుకోవచ్చనేది చాలా మందికి తెలియదు. ఐతే, వాటిని కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఈజీగా చెప్పగలిగాడు. విజయ్ తన ఓటు తనకు కావాలని కోర్టుకెక్కడం. దాన్ని సాధించుకోవడం వరకు బాగానే ఉంది. ఐతే, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు లాజిక్ అందని విధంగా ఉన్నాయి. లాజిక్ ని పక్కనపెడితే సర్కార్ విజయ్ అభిమానులకి విందు భోజనం. మిగితావారికి రొటీన్ పొలిటికల్ థ్రిల్లర్ గా అనిపించొచ్చు.
ఎవరెలా చేశారంటే ?
ఇది మురగదాస్ మార్క్ కథ. అది కూడా విజయ్ స్టయిల్ కి తగ్గట్టుగా రాసుకొన్న కథ. ఇలాంటి కథలు విజయ్ కి కొట్టిన పిండి. వాటిలో విజయ్ ఒదిగిపోయాడు. తన అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేయగలిగాడు. పొలిటికల్ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్ హావభావాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ కీర్తి సురేష్ ది దాదాపు అతిథి పాత్రనే. ఆమెకు నటించే స్కోప్ దక్కలేదు. వరలక్ష్మీ పాత్ర మాత్రం హీరో పాత్రకి బలమైన ప్రత్యర్థిగా నిలబడింది. ఆమె పాత్ర ఎంట్రీతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మిగితా నటీనటులు తమ తమ పరిధిమేరకు నటించారు. మిగితా తమిళ్ సినిమాల్లా సర్కార్ లోనూ తమళ వాసన ఎక్కువైంది.
సాంకేతికంగా :
ఏఆర్ రెహ్మన్ సంగీతం సినిమాని ఓ మెట్టు ఎక్కించేలా ఉంటుంది. ఈ సినిమాలో మాత్రం ఆయన మార్క్ పెద్దగా కనిపించలేదు. పాటలు సాదాసీదాగా ఉన్నాయి. నేపథ్య సంగీతంలోనూ అక్కడక్కడ మాత్రమే రెహ్మాన్ మార్క్ కనిపించింది. శ్రీకర్ ప్రసాద్ అక్కినేని ఎడిటింగ్ లో అంతగా పదును కనిపించలేదు. సెకండాఫ్‌లో ఇంకొన్ని సన్నివేశాలకు కత్తెరకు పెట్టొచ్చనిపించింది. రామ్, లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : సర్కార్ రాజకీయాలకి లాజిక్కు లేదు
రేటింగ్ : 3.25/5