కేంద్ర మంత్రి అనంత కుమార్ కన్నుమూత


కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంతకుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం ఆయన న్యూయార్క్‌లోని క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందారు. గత నెలలోనే బెంగళూరు తిరిగొచ్చారు. మళ్లీ మంత్రి ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరు శ్రీశంకర ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఈ తెల్లవారుజామున 2గంటల సమయంలో ఆయన కన్నుమూశారు.

1959 జులై 22న బెంగళూరులో అనంత కుమార్ జన్మించారు. 1996లో తొలిసారి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతకుమార్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తదితరులు సంతాపం తెలియజేశారు.