మళ్లీ గెలికిన సర్కార్
మురగదాస్ – విజయ్ ల ‘సర్కార్’పై రాజకీయ వివాదం రాజుకొన్న సంగతి తెలిసిందే. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకి కూడా దిగారు. చివరికి చిత్రబృందం, అన్నాడీఎంకే ల మధ్య రాజీ కుదిరింది. అన్నాడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సన్నివేశాలని తొలగించేందుకు చిత్రబృందం ఒప్పుకొంది. ఈలోపు దర్శకుడు మురగాదాస్ అరెస్ట్ వార్తలు, ఆయన ముందస్తు బెయిల్ కోసం దరాఖాస్తు చేసుకోవడం జరిగిపోయాయి. మురగని ఈ నెల 27వరకు అరెస్ట్ చేయరాదని కోర్టు తీర్పునిచ్చింది.
ఇక ముగిసిందన్న వివాదాన్ని సర్కార్ చిత్రబృందం మళ్లీ గెలికినట్టు కనబడుతోంది. సర్కార్ సూపర్ హిట్ ని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకొంది. ఈ సందర్భంగా తయారుచేసిన కేక్ కు ఇరువైపుల ఒకవైపు మిక్సీ, మరోవైపు గ్రైండర్ పెట్టారు. దీంతో పాటు ఓటు గుర్తు వేసిన వేలిని కూడా చూపిస్తూ మరో చిన్న బొమ్మ కూడా పెట్టారు. ఇప్పుడీ సర్కార్ కేక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.