వెంకన్నకి కేసీఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వెళ్లేందుకు బయలు దేరారు. అంతకంటే ముందు ఆయన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్నారు. స్వామి ముందు నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. ఆయన ఏ పని ప్రారంభించిన ముందుగా కోనాయిపల్లి వెంకన్నని దర్శించుకొంటారు. ఆనాడు టీడీపీ రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికీ 10సార్లు కోనాయిపల్లిని కేసీఆర్ దర్శించుకొన్నారు. ఇది 11సారి. వెంకన్నని దర్శించుకొన్న తర్వాత కోనాయిపల్లి గ్రామ ప్రజలతో కేసీఆర్ కొద్దిసేపు మాట్లాడారు. తనని మరోసారి భారీ మెజారిటీ గెలిపించాలని విజ్ఝప్తి చేశారు. ప్రతి రైతు ఖాతాలో రూ. 10లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు బంగారు తెలంగాణ సాధ్యమైనట్టని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ వెంకన్నని దర్శించుకొన్న సమయంలో గానీ, ఆయన నామినేషన్ వేసే సమయంలోనూ ఎక్కువ మంది కార్యకర్తలు రావొద్దని సూచించారు. కేవలం 5గురుతో మాత్రమే వెళ్లి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. భారీ బహిరంగ సభ మాదిరిగా కార్యకర్తలు భారీగా తరలి వస్తే.. దానికి సంబంధించిన ఖర్చు కూడా తన ఖాతాలో వేస్తారని… అందుకే కార్యకర్తలు రావొద్దని ముందుగానే సూచించారు. కేసీఆర్ వెంకన్న దర్శనం, నామినేషన్ దాఖలు పనులని మంత్రి హరీష్ రావు దగ్గరుండి చూసుక్కొన్నారు.