తెలంగాణ టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
తెలంగాణ తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితాని విడుదల చేసింది. మరో రెండు స్థానాలకి గానూ అభ్యర్థులని ప్రకటించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తా లకి అవకాశం కల్పించింది. ఇక, ఇప్పటికే టీ-టీడీపీ తొలి జాబితాలో 9స్థానాలకి అభ్యర్థులని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు జాబితాల్లో కలిసి ఇప్పటి వరకు 11 స్థానాలకి అభ్యర్తులని ఖరారు చేసింది. మరో మూడు స్థానాలకి మాత్రమే అభ్యర్థులని ఖరారు చేయాల్సి ఉంది. ఐతే, ఆ స్థానాలు ఏంటీ ? ఎవరికి అవకాశం ఇవ్వనున్నారనే ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.
రెండు జాబితాలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన రాజేంద్ర నగర్ స్థానం కోసం కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రయత్నించినట్టు సమాచారమ్. ఇటీవల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ ఈ స్థానంపై భారీ ఆశలు పెట్టుకొన్నాడు. ఐతే, ఇప్పుడవి అడియాశలయ్యాయి. ఆయన కాంగ్రెస్ మొండిచేయి చూపినట్టే. మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి రాజేంద్ర నగర్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఫైనల్ గా పొత్తుల్లో భాగంగా రాజేంద్ర నగర్ టీడీపీకి వెళ్లింది.
ఇక, మూడో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 417 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల సంఖ్య 504 చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వెల్ లో నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీష్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు.