రివ్యూ : అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొనీ

చిత్రం : అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొనీ (2018)

నటీనటులు : రవితేజ, ఇలియానా

సంగీతం : థమన్

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాత : మైత్రీ మూవీస్

రిలీజ్ డేటు : 16 నవంబర్, 2018.

రేటింగ్ : 2/5

ర‌వితేజ సినిమా అన‌గానే మొద‌ట గుర్తుకొచ్చేది వినోదమే. ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌దీ అదే పంథానే. మాస్ అంశాలు ఎన్ని ఉన్నా న‌వ్వించ‌డం మాత్రం మ‌రిచిపోరు. ఈ ఇద్ద‌రి క‌ల‌యికలో వ‌చ్చిన దుబాయ్ శీను, వెంకీ చిత్రాలు మంచి వినోదాన్ని పండించాయి. ఇలాంటి హిట్ కాంబో తెరకెక్కిన చిత్రం ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొనీ’. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచేశాయి. ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇవ్వడం కూడా సినిమాపై అంచనాలని పెంచేసింది.

ఇది కూడా తనదైన మార్క్ సినిమాయే అని శ్రీనువైట్ల ముందే చెప్పినా.. ఈసారి ఆయన మేజిక్ వర్కవుట్ అవుతుందేమోనన్న ఆశతో ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లారు. మరీ.. పాతదారిలోనే వైట్ల కొత్త హిట్ కొట్టాడు. అమర్ అక్భర్ ఆంటోనీలు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నారు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

అమెరికాలో ‘ఫిడో ఫార్మా’ కంపెనీ అధినేత ఆనంద్‌ ప్రసాద్‌. ఆయన వ్యాపార భాగస్వామి సంజయ్‌ మిత్రా. వీరు మంచి మిత్రులే కాదు. మంచి మనుషులు కూడా. అందుకే తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా (తరుణ్‌ అరోరా), సబూ మీనన్‌ (ఆదిత్య మీనన్‌), విక్రమ్‌ తల్వార్‌ (విక్రమ్‌జీత్‌) , రాజ్‌ వీర్‌ల కి కంపెనీలో 20 శాతం షేర్స్‌ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. వీరు మాత్రం ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు.

ఆ దాడి నుంచి ఆనంద్‌ ప్రసాద్‌ కుమారుడు అమర్ (రవితేజ), సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా) బయటపడతారు. ఆ సమయంలో వీరిద్దరు విడిపోతారు. తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్‌, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? ఐతే, 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి అమర్ ఎలా పగ తీర్చుకున్నాడు.? ఈ కథలో అక్బర్‌, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

* రవితేజ నటన

* సినిమాటోగ్రఫీ

* ప్రొడక్షన్ వ్యాల్యూస్

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* రొటీన్ కామెడీ

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

ఇలాంటి కథలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. పాత లైన్ ని ఎంచుకొన్న శ్రీనువైట్ల దానికి న్యూయార్క్ నేపథ్యంతో రాసుకొన్నాడు. అమర్ ప్రతికారం తీసుకొనే క్రమంలో అక్భర్, ఆంటోనీ పాత్రలని అల్లుడుకొన్నాడు. అదెలా ? అన్నది తెరపై చూడాలి. ఐతే, మరోసారి పాత దారిలోనే వెళ్లిన వైట్ల చేతులు కాల్చుకొన్నారనే చెప్పాలి. సినిమాని ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు ఆ తర్వాత కావాలని తనదైన మార్క్ కామెడీని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఐతే, అది అతికినట్టే ఉంది. అమర్ పాత్ర బాగున్నా.. అక్భర్, ఆంటోనీ పాత్రల తీరు, డైలాగ్స్ ఆకట్టుకొనేలా లేవు. ఫలితంగా మూడు గెటప్ లని అనుకొన్నా అవి పవర్ ఫుల్ గా లేవు.

ఇక ఎప్పటిలాగే రవితేజ ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకొన్నాడు. ఆయన నటనకి వంక పెట్టలేం. కానీ, కథల ఎంపికపైనా శ్రద్ద పెడితే బాగుణ్ను అనిపించింది. అమర్, అక్భర్, ఆంటోనీలుగా రవితేజ నటన బాగుంది. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన ఇల్లీ ఆకట్టుకొంది. అప్పుడు ముద్దుగా కనిపించే ఇల్లీ.. ఇందులో బొద్దుగా కనిపించింది. పెళ్లి చేసుకొని ఆంటీ అయిందిగా.. ! గ్లామర్ మాత్రం తగ్గలేదు. చెప్పుకోవడానికి స్టార్ కమెడియన్స్ అంతా ఉన్నా నాన్ స్టాప్ గా నవ్వించలేకపోయారు. మిగిలిన నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

కథ-కథనం బలంగా ఉంటే వాటిని మరో రేంజ్ కి తీసుకెళ్లడానికి టెక్నికల్ వాల్యూస్ పనికొస్తాయి. ఇందులో సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న థమన్ మంచి పాటలు ఇవ్వకపోయినా.. నేపథ్య సంగీతంలో తనదైన మార్క్ చూపించాడు. సినిమాలో మరికొన్ని సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు అనిపించింది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : మరోసారి పాతదారిలోనే ‘అమర్ అక్భర్ ఆంటోని’ని తీసుకొచ్చారు శ్రీనువైట్ల. వైట్ల మార్క్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. మిగితా ప్రేక్షకులు మాత్రం ధైర్ఘ్యం చేసి ఈ సినిమా థియేటర్స్ కి వెళ్లాల్సిందే.

రేటింగ్ : 2/5