చంద్రబాబుని కాంగ్రెస్ దూరం పెట్టనుందా ?

భాజాపాకు దూరమైన టీడీపీ మరో జాతీయపార్టీ కాంగ్రెస్ పంచన చేరింది. ఆ పార్టీతో కలిసి కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. దీనిపై ఈ నెల 10న ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల నేతలతో ఓ సమావేశం కూడా జరిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా, దాదాపు 14 పార్టీల చెందిన నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పడేలా కనబడింది.

ఐతే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారింది. ఇక్కడ టీఆర్ఎస్ ఘనవిజయాన్ని సాధించింది. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేసీఆర్..తన లక్ష్యం జాతీయరాజకీయాలని ప్రకటించారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలిపారు. ఇప్పుడీ రెండు పనులనే ఒకేసారి చేస్తున్నట్టున్నాడు కేసీఆర్. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ప. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు కేసీఆర్.

ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. తెలంగాణకి రావాల్సిన దాదాపు 16 అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ కూడా ప్రస్తావనకి వచ్చినట్టు సమాచారమ్. ఇక, కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాక ముందే ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తున్నట్టు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అంతకుముందు ప.బెంగాల్ లో మమతా బెనర్జీ కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సానుకూలంగా స్పందించింది.

మొత్తంగా ఇన్నాళ్లు ఏపీ సీఎం చంద్రబాబు తృతీయఫ్రంటులో చేరతారని భావించిన నేతలంతా కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంటుపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే జరిగితే చంద్రబాబుకు గడ్డు పరిస్థితి తప్పదేమో. తృతియఫ్రంట్ సక్సెస్ కాకుండా చంద్రబాబుని కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించుకోదు. చివరికి.. చంద్రబాబుని కాంగ్రెస్ కూడా పక్కనపెట్టే రోజులు వస్తాయోమో చూడాలి.