హైకోర్టు విభజన అడ్డంకి తొలగింది

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుని విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం జనవరి 1వ తేది నుంచి రెండు హైకోర్టులుగా విడిపోనున్నాయి. ఐతే, దీనిపై ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టుకి రెండు రోజులు (సోమ, మంగళ) సెలవు కావడంతో.. ఈ పిటిషన్ పై సోమవారం అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ఈ పిటిషన్‌ను విచారణ స్వీకరించినప్పటికీ.. అత్యవసర విచారణను చేపట్టలేమని స్పష్టంచేశారు. సుప్రీం కోర్టుకు శీతకాల సమావేశాలు కొనసాగుతున్నందున జనవరి రెండున కోర్టు ప్రారంభమైన రోజు సాధారణ విచారణ చేపడతామని తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 1న హైకోర్టు విభజనకి అడ్డంకి తొలగినట్టయ్యింది. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.