చంద్రబాబుతో మోడీ డైరెక్ట్ ఫైట్

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్ ఫైట్ కి దిగినట్టు కనబడుతోంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చాక చంద్రబాబు నేరుగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగన్నరేళ్లలో మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మోడీ సర్వ నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు చంద్రబాబు. వచ్చే సార్వత్రికల్లో కేంద్రంలో భాజాపాకు అధికారం దూరం చేసే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు.

మరోవైపు, ఇన్నాళ్లు ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల విషయంలోనే కేంద్రంపై చంద్రబాబు విమర్శలు చేసేవారు. ఈ మధ్య జాతీయ అంశాలని ప్రస్తావిస్తున్నారాయన. రాఫెల్ డీల్ విషయంలోనూ ప్రధానిపై ఎటాక్ చేస్తున్నారు. తమ పార్టీ ఎంపీలతోనూ ఈ విషయంపై మాట్లాడిస్తున్నారు. బుధవారం లోక్ సభలో రాఫెల్ డీల్ పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని గట్టిగా నిలదీసీన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబుని ఎదుర్కొనేందుకు స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగారు.

బుధవారం ప్రధాని ఏపీ బీజేపీ బూత్‌ స్ధాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏపీ మార్పు కోరుకుంటోంది. తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్‌ల కలయికను ప్రజలు తిరస్కరించారు. ఏపీలో కూడా అదే జరగబోతుందన్నారు. ఏపీకి ఇచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ దక్కలేదు. జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించాం. ఏపీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని ప్రధాని అన్నారు.

కేంద్ర పథకాలను టీడీపీ తమ ఘనతగా చెప్పుకుంటోంది. టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్‌ను ఏపీ ప్రజలకు వివరించాలని మోదీ కార్యకర్తలకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత కూడా చంద్రబాబుపై మోడీ వరుస ట్విట్స్ తో విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్‌ను ‘దుష్ట కాంగ్రెస్’ అని సంబోధించేవారని కార్యకర్తలు తనకు చెప్పారని, కానీ ఇప్పటి టీడీపీ ‘దోస్త్ కాంగ్రెస్’ అని సంబోధిస్తోందని ఎద్దేవా చేశారు.