రాహుల్’తో రఘువీరా భేటీ.. ఏం తేల్చుతారో.. ?

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా టీడీపీతో పొత్తు వ్యవహారంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ?? అనే అంశంపై రాహుల్‌తో చర్చించనున్నారు. దీనిపై క్లారిటీ వస్తే గనుక ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనకు అధిష్టానం అనుమతి కోరనునున్నారు రఘువీరా. కాంగ్రెస్-టీడీపీ కలిస్తే.. ఇటీవలే తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో వస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీతో పొత్తుపై రాహుల్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోనూ కాంగ్రెస్ – టీడీపీ కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ రాహుల్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించే అవకాశం రఘువీరాకు రాకపోవచ్చు. అప్పుడంతా చంద్రబాబు సూచించిన అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్ కేటాయించే ఛాన్స్ ఉంది. ఇంతకీ నేటి రాహుల్-రఘువీర భేటీలో ఏం తేల్చుతారన్నది చూడాలి.