ఆ ట్రక్కు ఉత్తమ్’ని గెలిపించింది

కారుకి ట్రక్కు గండికొట్టింది అంటున్నారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా తెరాసకి 47 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కేటీఆర్ గొప్పగా చెప్పుకొంటున్నారు. శుక్రవారం హైదరాబాద్ తెరాస భవన్ లో చొప్పందడి, హుజూర్ నగర్ కి చెందిన కార్యకర్తల సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు కేటీఆర్.

ట్రక్కు గుర్తుకి సుమారు 2లక్షల ఓట్లు పడ్డాయి. ట్రక్కుని కూడా కారుగా భావించి కొందరు ఓట్లేశారు. ఆ ట్రక్కు ఓట్లు కూడా పడివుంటే తెరాస 50శాతం ఓట్లు దక్కేవి. ఇక, ఆ ట్రక్కు ఓట్లతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఎన్నికల ముందు మంత్రి పదవులు పంచుకొన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకి ప్రజలు ఇచ్చిన తీర్పుతో దిమ్మతిరిగిపోయిందని.. ఆ దెబ్బకు వారు ఇంకా కోలుకోలేదన్నారు కేటీఆర్.