రివ్యూ : పేట
చిత్రం : పేట
నటీనటులు : రజనీకాంత్, సిమ్రన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, యోగిబాబు తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజు
నిర్మాత : కళానిధి మారన్, అశోక్ వల్లభనేని
రేటింగ్ : 3.25/5
అభిమానులు పండగ చేసుకొనే సినిమా చేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కబాలి, కాలా వారికోసమే చేశాడు. ఐతే, అవి రజనీ అభిమానులని పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయాయి. 2.ఓ సినిమా మెగా బ్లాక్ బస్టర్ హిట్టైనా.. అది టెక్నకల్ సినిమా. రజనీ నుంచి మాస్, మసాలా కోరుకొనే ప్రేక్షకులకి అది ఎక్కలేదు. ఈ నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ పేటా సినిమా చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ని చూస్తే ఈసారి రజనీ అభిమానుల పంటపండినట్టే అనిపించింది. మరీ.. సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పేటా’ రజనీ అభిమానులు పండుగ చేసుకొనేలా ఉందా.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
కాళీ (రజనీకాంత్) ఒక కాలేజ్‌లో హాస్టల్ వార్డెన్‌గా చేరతాడు. అక్కడ చోటు చేసుకునే రకరకాల సమస్యలను తనదైన స్టైల్లో పరిష్కరిస్తాడు. ఒక ప్రేమ జంటను కూడా కలుపుతాడు. అనుకోని పరిస్థితుల్లో లోకల్ గూండాతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే అతని పేరు కాళీ కాదు… పేట తెలుస్తుంది. అతడిది ఉత్తర్‌ప్రదేశ్ అని తెలుస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సింహాచలం (నవాజుద్దీన్) అనే పెద్ద రాజకీయ నాయకుడితో విభేదాలు ఉంటాయి. అవి ఏంటి ? అసలు యూపీ నుంచి పేట ఎందుకు వచ్చాడు ? మళ్లీ అక్కడకు వెళ్లాడా ? వెళ్లి ఏం చేశాడన్నది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
* రజనీ స్టయిలీష్ నటన
* సిమ్రన్-రజనీల ట్రాక్
* నేపథ్య సంగీతం
* సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
* కథా, కథనం
* సెకాంఢాప్
సినిమా ఎలాసాగింది ?
కార్తీక్ సుబ్బరాజు సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాలో అనూహ్యమైన మలుపులు ఉంటాయి. సస్పెన్స్ తో కథని నడపడం ఆయన ప్రధాన బలం. కాకపోతే అతను కూడా రజనీ స్టైల్‌ను ఫాలో అయిపోతూ, రజనీ సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులతో కథను తయారు చేసుకున్నాడు. బాషా, నరసింహ, ముత్తు, అరుణాచలం సినిమాలని మించి రజనీని స్టయిలీష్ గా చూపించాడు. 90లో రజనీకాంత్ కనిపించాడు.
తొలి భాగం రజనీ అభిమానులు పండగ చేసుకొనే సన్నివేశాలతో అల్లుకొన్నాడు. తొలి సగంలో రజనీ మేనరిజమ్స్, స్టైల్‌పై ఆధారపడిన దర్శకుడు, సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్, తను తీర్చుకునే పగతోనూ పూర్తి చేశాడు. బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటే ఇలాంటి కథలు అదిరిపోతాయి. ఇటీవల కాలంలో రజనీని రజనీలా చూడలేకపోయామని నిరాశ పడుతున్న అభిమానులకు మాత్రం ఇది ఫుల్‌మీల్స్.
ఎవరెలా నటించారు ?
రజనీకాంత్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కుర్రాడిలా రజనీకాంత్ ఇచ్చే హావభావాలు కాస్త ఎంటర్టైన్ చేస్తాయి. ఈ వయసులోనూ అంత జోరుగా నటించడం కేవలం రజనీ వల్ల మాత్రమే అవుతుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయసేతుపతి లాంటి నటులకు ఈ కథలో చోటిచ్చాడు దర్శకుడు. కానీ, వాళ్ల స్థాయికి తగ్గట్టు ఆ పాత్రలను తీర్చిదిద్దలేదేమోననిపిస్తుంది. సిమ్రన్, త్రిషలతో రజనీకాంత్ నడిపిన లవ్ ట్రాక్ సినిమాకు కాస్త ఉపశమనం. అయితే, వారివి ప్రాధాన్యం ఉన్న పాత్రలేమీ కాదు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతికంగా :
అనిరుధ్ అందించిన పాటల్లో మాస్ మరణ వినడానికి, తెరపై చూడ్డానికి బాగుంది. నేపథ్య సంగీతంలో అనిరుధ్ మేజిక్ చేశాడు. తిరు సినిమాట్రోగఫ్రీ చాలా బాగుంది. కొన్ని చోట్ల సినిమా స్లోగా సాగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : అసలు సిసలైన రజనీ సినిమా ఇది. రజనీ నుంచి అభిమానులు కోరుకొనే అన్నీ అంశాలు పేటాలో ఉంటాయి.
రేటింగ్ : 3.25/5