బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న పురస్కారం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. నానాజీ దేశ్‌ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాలకు ఎంపికచేసింది.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తినార్జించారు.
2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలు అందించారు. రాష్ట్రపతిగా సేవలందించి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని చాటారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ దేశం తరఫున గళం విన్పిస్తూ తన ప్రత్యేకత నిలుపుకొన్నారు. అలాంటి ప్రణబ్‌కు భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
నానాజీ దేశముఖ్ జనసంఘ్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు. 2010 ఫిబ్రవరిలో తన 93వ ఏట మరణించారు. భూపేన్ హజారికా అస్సామీ వాగ్గేయకారుడు. మానవతావాదిగా అయన రచించిన పాటలు అన్ని భారతీయ బాషలలోకి అనువాదమయ్యాయి. సంగీత దర్శకత్వంలో జాతీయ అవార్డుతో పాటు పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు కూడా అందుకున్నారు. 2012లో హజారికా మరణించగా మరణానంతరం భారతరత్న అందుకున్నారు. కాంగ్రెస్ కురవృద్దుడు, ఆర్ఎస్ఎస్ నేత, వాగ్గేయకారుడు ఒకేసారి భారత్న అవార్డులని ప్రకటించి బీజేపీ ప్రభుత్వం తన ప్రత్యేకతని చాటుకొంది.