రాయుడుపై ఐసీసీ యాక్షన్
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు ఐసీసీ యాక్షన్ తీసుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా అతనిపై వేటు వేసింది. ఈ నెల 13న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడి బౌలింగ్ శైలిపై ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన పరీక్షకు హాజరుకావాల్సిందిగా రాయుడుని ఐసీసీ ఆదేశించింది. ఐతే, నిర్ణీత 14 రోజుల్లో అతను హాజరుకాకపోవడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఐసీసీ నిబంధనల్లోని 4.2 క్లాజ్ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా రాయుడుపై నిషేధం విధించింది. రాయుడు బౌలింగ్ శైలిని పరిశీలించి.. సక్రమంగానే బౌలింగ్ చేస్తున్నాడని నిర్ధారించే వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
అంబటి రాయుడు పార్ట్‌టైమ్ స్పిన్నర్. తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు. ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో రాయుడు ఆడుతున్నాడు.