ప్రజా సంఘాలే చంద్రబాబు ఆయుధం
ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకొనేందుకు పక్కా ప్లాన్ వేసినట్టు కనబడుతోంది. ప్రత్యేక హోదా అంశంపై బుధవారం ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైకాపా, కాంగ్రెస్, భాజపా, జనసేన, వామపక్షాలు హాజరుకాలేదు.
ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీఎస్పీ, ఎస్పీ, ప్రజాశాంతి పార్టీ, నవతరం పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, వివిధ ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. ఐతే, ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో చేరేందుకు బుధవారం అఖిల పక్షానికి హాజరుకాని వైకాపా, కాంగ్రెస్, భాజపా, జనసేన, వామపక్షాల నేతలని ఆహ్వానిస్తామని తెలిపారు. అంతేకాదు.. జేఏసీ సాయంతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా ప్లాన్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలతో కలిసి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ చేయబోయే పోరాటల్లో ప్రతిపక్ష పార్టీలు పాల్గొనక తప్పని పరిస్థితులని క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈ దీక్షకు తెలిపేందుకు జాతీయపార్టీల నేతలంతా రాబోతున్నారు. మొత్తానికి ప్రత్యేక -హోదా అంశంతో ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోనూ తనదైన శైలిలో రాజకీయం చేయబోతున్నాడు బాబు.