తెలంగాణ మంత్రులు వీరే.. !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేభినేట్ ని విస్తరించారు. తొలి విడతగా పదిమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్ లని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. వీరితో గవర్నర్ నరసింహా ప్రమాణ స్వీకారం చేయించారు.
సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి : వనపర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
ఈటల రాజేందర్ : టీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పనిచేశారు. గత కేబినెట్‌లో ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.
జగదీశ్ రెడ్డి : రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీశ్ రెడ్డి.. గత కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ : ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్‌లలో తలసాని మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ గత కేబినెట్‌లోనూ పనిచేశారు.
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత కేబినెట్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.
ఎర్రబెల్లి దయాకరరావు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.
శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు కొత్తవారు. తొలిసారి మంత్రులయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజునే మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనకి హోంశాఖని కేటాయించారు. మొత్తంగా 12 మంది ఉన్న కేసీఆర్ కేబినెట్ లో ఏడుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక మైనారిటీ ఉన్నారు.