అందుకే నాకు మంత్రి పదవి దక్కలేదు : హరీష్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కేబినేట్ లో హరీష్ రావుకి చోటు దక్కలేదు. తొలివిడతగా పదిమందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకొన్నాడు కేసీఆర్. మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్ లని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. కేసీఆర్ కేబినేట్ లో హరీష్ చోటు దక్కకపోవడంతో.. పార్టీలో హరీష్ రావుని కావాలనే తొక్కిస్తున్నారు అంటూ గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ప్రచారంపై తాజాగా హరీష్ రావు స్పందించారు. “టీఆర్ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ గల సైనికుడిని. తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తాను. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలు, వివిధ అంశాల ప్రాతిపదికన తీసుకొని చేపట్టారు. ఈ సారి కొత్తగా ఆరుగురికి చోటు దక్కడం … వివిధ అంశాల నేపథ్యంలో కేబినేట్ కూర్పు జరిగింది. అందుకే తనకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దానిపై నాకు ఎలాంటి అసంత్రుప్తి లేదు” అన్నారు హరీష్.
అంతేకాదు.. ‘తనకు ఎలాంటి సేనలు, గ్రూపులు లేవు. సీఎం కేసీఆర్ అప్పగించిన పని బాధ్యతాయుతంగా చేపడుతా. పార్టీ ఉన్నతి కోసం క్రమశిక్షణ గల సైనికుడిగా పాటుపడుతా. అసత్య ప్రచారాన్ని మానుకోవాలి. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న ప్రచారానికి తెరదించాలి’ అని కోరారు. మరోవైపు, హరీష్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. మంత్రి పదవి దక్కపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని కొన్ని టీవీ చానెల్ కి చెందిన వార్తపత్రికలు రాస్తున్నాయి. మొత్తానికి.. హరీష్ కి మంత్రి పదవి దక్కపోవడంపై ఆయన నియోజవర్గ ప్రజలు, అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.