మోహన్ బాబు ‘వెన్నుపోటు’ గుర్తుచేశాడు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటుపొడిచాడు’ అన్నది అపవాదు. దీనికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సంపూర్ణంగా మద్దతు పలికారన్నది ఆనాటి నుంచి జరుగుతున్న ప్రచారం. ఈ వెన్నుపోటు అంశాన్ని క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించలేదన్నది అందరి మాట. ఐతే, రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో అసలైన, నిజమైన వెన్నుపోటు చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అందుకు తగ్గట్టుగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రచారమంతా వెన్నుపోటు ఏపీసోడ్ పైనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెన్నుపోటు డైలాగ్ ట్రెండింగ్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఇదే డైలాగ్ ని డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా గుర్తు చేశారు. ఆయన హీరోగా నటించిన ‘కలెక్టర్ గారు’ బ్లాక్ బస్టర్ హిటైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ ని మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

“రాజీపడి న్యాయశాస్త్రాన్ని
హంతకులకు తాకట్టుపెట్టేవాడు లాయరు కాడు..
రాజీపడి రౌడీయిజానికీ రాజకీయానికి లొంగిపోయి
పరిపాలన చేసేవాడు కలెక్టరు కాడు..
వెనుదిరిగి వెళ్ళిపోవడం అభిమన్యుడికి తెలీని విద్య..
రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పొడవడం నాకు
తెలియని విద్య”
చిత్రం: కలెక్టర్ గారు

ఈ డైలాగ్ లో ‘రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పొడవడం నాకు తెలియని విద్య’ అని ఉంది. ఇది ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి పోస్ట్ చేశారా.. ? లేదంటే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రమోట్ చేయడానికి చేశారా.. ?? ఈ రెండు కాకుండా నిజంగానే ‘కలెక్టర్ గారు’ సినిమా గుర్తుకొచ్చి.. అందులోని ఈ పవర్ డైలాగ్ ని పోస్ట్ చేశారా.. ?? అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది.