మంగళగిరి నుంచి లోకేష్ పోటీ
ఏపీ మంత్రి లోకేశ్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మొదట లోకేష్ కోసం భీమిలి, విశాఖ ఉత్తరం, కుప్పం, పెదకూరపాడు వంటి నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. తర్జభర్జన అనంతరం లోకేష్ కోసం మంగళగిరి స్థానాన్ని కేటాయించారు.
రాజధాని ప్రాంతంగా మంగళగిరి అభివృద్ధి చెందడంతో పాటు మున్ముందు సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లోకేశ్ ఇక్కడినుంచే బరిలో దించితే బాగుంటుందని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో తెదేపా అభ్యర్థి ఓటమిపాలయ్యారు.
మరోవైపు, ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మంత్రి శిద్ధా రాఘవరావును బరిలో దించుతున్నట్టు సమాచారమ్. అలాగే, శిద్ధా ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి స్థానాన్ని ఇటీవల తెదేపాలో చేరిన ఉగ్ర నర్సింహారెడ్డికి చంద్రబాబు కేటాయించారు.