రేవంత్ రెడ్డి.. మళ్లీ మొదలెట్టాడు !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రెడ్ది ఒకరు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ బయటికొచ్చాడు. మళ్లీ మొదలెట్టాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే… కాంగ్రెస్ తెందూల్కర్‌ లాంటిదని వ్యాఖ్యానించారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచిన భాజపా… మూడు మాసాల తర్వాత వచ్చిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో ఎందుకు ఓడిపోయిందని రేవంత్‌ ప్రశ్నించారు. ఇదే తరహా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకొంటుందని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారన్న మాట. అంతేకాదు.. అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిగా అధిష్ఠానం ఆదేశించినట్లు నడుచుకోక తప్పదన్నారు.

ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో.. ధైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ముఖ్యనేతలకు ఉందని రేవంత్ అన్నారు. ఇప్పటికే అధిష్టానం నుంచి రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. అది ఎక్కడి నుంచి అన్నది ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని సమాచారమ్.