రొమాంటిక్ సినిమాలో మందిరా బేడి

రొమాంటిక్ సినిమాలో బాలీవుడ్ నటి మందిరా బేడి కనిపించబోతుందా.. ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభాస్ ‘సాహో’తో మందిరా బేడి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెది కీలక పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీదుండగానే మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది మందిరా. పూరి టీంతో మందిరా జాయిన్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూరి ఎనర్జిటి హీరో రామ్ ని ‘ఇస్మార్ట్ శంకర్’ తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

ఐతే, ‘ఇస్మార్ట్ శంకర్’లో మందిరా నటించడం లేదు. పూరి తనయుడు ఆకాష్ నటిస్తున్న రెండో సినిమా ‘రొమాంటిక్’లో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రొమాంటిక్ కథని పూరి అందించారు. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆకాష్ జంటగా కొత్తమ్మాయి కేతిక శర్మ నటిస్తోంది. ఈ చిత్రాన్ని పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.