వివేకా హత్యపై చంద్రబాబు ప్రశ్నల వర్షం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుటుంబ సభ్యులు ఇన్ని విషయాలు ఎందుకు దాచినట్టు ? అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యులు వ్యవరించిన తీరుని వివరిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబు. మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది. పోలీసులను కూడా సహజ మరణమే అని నమ్మించే ప్రయత్నం చేశారు. పోస్ట్ మార్టమ్ జరుగుతున్న సమయంలో సీన్’ని మార్చారు. తమపై ఆరోపణలు చేసే పనిని మొదలెట్టారని చంద్రబాబు తెలిపారు.

సాధారణంగా ఘటనాస్థలం వద్దకు ఎవరూ వెళ్లకూడదు. బెడ్‌రూమ్‌లో తలకు గాయమైందని గుడ్డ కట్టారు. సీఐ వెళ్లేలోపు రక్తం కడిగేశారు. తర్వాత ఆస్పత్రికి తరలించారు. వివేకా శరీరంపై బలమైన గాయాలున్నాయి. మృతదేహం చూసిన ఎవరికైనా హత్య అని తెలుస్తుంది. ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు విషయం ఎందుకు దాచారు? అసలు బెడ్‌రూమ్‌
ఎందుకు శుభ్రం చేశారు. సహజ మరణానికి, హత్యకు వ్యత్యాసం తెలియదా? అవినాశ్‌రెడ్డికి హత్య విషయం ఎవరు చెప్పారు? దారుణ హత్యకు గురైతే ముందే ఎందుకు చెప్పలేకపోయారు? కావాలనే ఇతరులపై బురద చల్లుతున్నారని సీఎం అన్నారు.

వివేకాని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలియాలి. బెడ్‌రూమ్‌ వద్ద 2లీటర్ల రక్తం ఉందని ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ఉంది. వివేకా హత్యను రాజకీయ లబ్ధికి వాడుకుంటారా? హత్య జరిగిన చోట శవపంచనామా చేస్తారని తెలియదా? చట్టాన్ని అతిక్రమించి.. సాక్ష్యాలను తారుమారు చేసే అధికారం ఎవరికీ లేదు. సాక్ష్యాలు ధ్వంసం చేశారు కనుకే మీపై అనుమానాలు పెరిగాయి. దోషులైతేనే సాక్ష్యాలు లేకుండా చెరిపివేస్తారు. తొలుత సహజ మరణమని నమ్మించే ప్రయత్నం చేశారు. శవపరీక్ష తర్వాతే అన్ని విషయాలు బయటకు వచ్చాయని సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు.