ఎమ్మెల్యేల చేతిలో.. ఎంపీ అభ్యర్థుల ఎంపిక !
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 16 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెరాస అభ్యర్థుల ఎంపికకు విస్తృత కసరత్తు చేస్తోంది. కేసీఆర్ ఇప్పటికే సర్వేలు కూడా చేయించారు. ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులని ఖరారు చేశారు కూడా. ఇక, మిగిలిన పది అభ్యర్థుల ఎంపిక సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయానికి అధిక ప్రాధాన్యతని ఇస్తున్నారు. వారు అంగీకరించిన అభ్యర్థినే ఎంపిక చేయాలనే నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా శాసనసభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గురువారం రాత్రి కూడా పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. కొంత మంది ఎమ్మెల్యేలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమై అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ బలానికి తోడు అభ్యర్థులు కూడా గట్టి వారై ఉండాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు పోటీకి నిలిస్తే, వారికి దీటైన అభ్యర్థులనే బరిలోకి దింపాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా.. తెలంగాణలో ఎమ్మెల్యేల చేతిలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఆధారపడి ఉండటం విశేషం.