‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కు నో సెన్సార్ !

ఊహించినట్టుగానే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ చిక్కులు తప్పలేదు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదలని వాయిదా వేసుకోవాలని సూచించింది. ఐతే, దీనిపై దర్శకుడు వర్మ న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ‘సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతా. సినిమా విడుదల కోసం న్యాయ పోరాటం చేస్తా’నని వర్మ ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న రావాల్సిన ‘లక్షీస్ ఎన్టీఆర్’ విడుదలపై సందిగ్ధత ఏర్పడింది.

ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి రజత్ కుమార్ ఇప్పటికే స్పందించారు. సినిమాపై ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోలేం. సినిమా చూసి.. ఆ తర్వాత అవసరమైతే సినిమాపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈలోగా సెన్సార్ రూపంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సమస్యలు మొదలయ్యాయి. మరీ.. వర్మ న్యాయపోరాటం ఫలిస్తుందా.. సినిమా ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. ?? అనేది చూడాలి.