మహేష్ కథ అద్భుతంగా వస్తుందట !

అపజయాలు ఎరగని టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వెంకీ, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా వచ్చిన ‘ఎఫ్2’ ఏకంగా వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. అసలైన సంక్రాంత్రి సినిమా అనిపించుకొంది. నిర్మాతకు భారీ లాభాలు తీసుకొచ్చింది.

ఇక, అనిల్ రావిపూడి ఐదవ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా గురించి అనిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “తన 5వ చిత్రం కథ రెడీ అవుతోంది. అద్భుతంగా వస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది” అనే అర్థం వచ్చేలా ట్విట్ చేశారు అనిల్.

ఈ చిత్రంలో మహేష్ జంటగా రష్మిక మందనని ఎంపిక చేసినట్టు తెలిసింది. సీనియర్ లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని సంప్రదించారు. ఐతే, ఆయన నో చెప్పడంతో మరో నటుడుని తీసుకొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమా బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే అనిల్ దర్శకత్వంలో మహేష్ సినిమా మొదలు కానుంది.