గోవా సీఎం పారికర్ కన్నుమూత

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ (63) కన్నుమూశారు. చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. పారికర్ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు.

1955 డిసెంబరు 13న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పారికర్‌ పాఠశాల దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ముంబయి ఐఐటీలో మెటలర్జీలో ఇంజినీరింగ్‌ను చదివినప్పుడు కూడా ఆ అనుబంధాన్ని వీడలేదు. ఖాకీ నిక్కరు ధరించి, లాఠీ పట్టుకొని వార్షిక ‘సంచాలన్‌’లో పాల్గొనడాన్ని గర్వంగా భావించి ఫొటోలు తీసుకునేవారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు తగిన మెజార్టీ రాకపోవడంతో తిరిగి రాష్ట్రానికి వచ్చి గోవా ఫార్వర్డ్‌ పార్టీ, ఎంజీపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

పారికర్ మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం సోమవారం ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం సంతాపదినంగా ప్రకటించింది. సోమవారం సాయంత్రం పనాజీలో పారికర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.