టీడీపీతో బైరెడ్డి సూపర్ డీల్

కర్నూలుకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీతో సూపర్ డీల్ కుదుర్చుకొన్నారు. గతంలో తెదేపాలో ఉన్న భైరెడ్డి రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు. అనంతరం ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ని స్థాపించి రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన తెదేపా అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారు. ఓ డీల్ ని తెదేపా అధిషానం ముందుంచారు. ఆ డీల్ ఓకే అయితే..త్వరలోనే తెదేపాలో చేరనున్నారు

ఇంతకీ ఆ డీల్ ఏంటంటే.. ? కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే, ప్రస్తుత తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి తెదేపా అధిష్ఠానాన్ని కోరుతున్నారు. తాను ఆ స్థానం నుంచి బరిలోకి దిగితే అటు అసెంబ్లీ స్థానంలో గెలవడంతో పాటు.. ఇటు తెదేపా లోక్‌సభ అభ్యర్థి గెలుపునకు కూడా లాభిస్తుందని చెప్పినట్లు సమాచారమ్. మరోవైపు, భైరెడ్డిని తీసుకొనే విషయంలో తెదేపా అధిష్టానం సానుకూలంగా స్పందించింది. దీంతో.. బైరెడ్డి సొంతగూటికి రాడం ఖాయమైనట్టే.