టీడీపీకి నామా రాజీనామా


తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడారు. కొద్దిసేపటిక్రితమే నామా తెలుగుదేశం పార్టీకి, పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

సోమవారం నామా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఇస్తే తెరాసలో చేరుతానని చెప్పినట్టు తెలిసింది. అందుకు సీఎం కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నామా టీడీపీని వీడి తెరాసలో చేరే ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

శాసనసభ ఎన్నికల్లో నామా నాగేశ్వర రావు మహా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజానికి.. ఖమ్మం లోకసభ స్థానానికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు పోటీ చేస్తారని భావించారు. ఐతే, ఖమ్మం టికెట్ తనకు కావాలంటూ కాంగ్రెసు నేత రేణుకా చౌదరి పట్టుబట్టి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో నామా కారెక్కి ఖమ్మం బరిలో దిగనున్నారు