లండన్’లో మోడీ అరెస్ట్ !

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీని లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నీరవ్ లండన్‌లోని హోల్‌బోర్న్‌ మెట్రో స్టేషన్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే నీరవ్‌ మోదీ లండన్‌లో ఉన్నట్టు బ్రిటిష్‌ న్యూస్‌ పేపర్‌ ‘ది టెలిగ్రాఫ్‌’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆయన లండన్‌ నగర వీధుల్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్న వీడియోను టెలిగ్రాఫ్‌ సంస్థ విడుదల చేసింది.

లండన్‌లోని సెంటర్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్‌ ఉంటున్నాడని, అక్కడికి దగ్గరలో ఉన్న సోహోలో నీరవ్‌ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు కూడా ‘ది టెలిగ్రాఫ్‌’ పత్రిక తెలిపింది. దీంతో నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ మార్చి 9న లండన్‌లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్‌ కోర్టు ఇంతకుముందు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేసింది. చట్టపరమైన చర్యల తర్వాత నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.