అభిమానులకు విజయ్ విలువైన సలహా

టాలీవుడ్ యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకి చాలా విలువైన సలహా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల్ని పాటించమని కోరారు. చాలా మంది బైక్‌ నెంబర్‌ ప్లేట్‌పై కుటుంబ సభ్యులు, ఇష్టమైన స్టార్లు, దేవుళ్ల పేర్లను రాసుకొంటారు. ఈ కోవలో కొంత మంది విజయ్‌ అభిమానులు బైక్‌ నెంబర్‌ ప్లేట్‌పై ‘రౌడీ’ అని రాసుకొంటున్నారు.

ఇలా రాసుకొన్న యువకుల బైక్‌ ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. నెంబర్‌ ప్లేట్‌ లేకపోయినా, దానిపై రిజిస్టర్‌ నెంబర్‌ లేకపోయినా సీఎమ్‌వీ రూల్స్‌ను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న విజయ్ దేవరకొండ ఓ లేఖ ని విడుదల చేశారు.

‘మీరూ నా కుటుంబంలో భాగమే. సమస్యల్లో పడొద్దని నా కుటుంబ సభ్యులకు చెబుతున్నా. కొన్ని నిబంధనల్ని మనం పటించాలి. అవి ఉన్నది మన మంచి కోసమే. నేనూ వాటిని ఫాలో అవుతా. కుటుంబ సభ్యులు, స్నేహితులు, దేవుళ్లపై మీకున్న ప్రేమను మీ బైక్‌పై ఉన్న ఇంకేదైనా భాగంలో రాసి, చూపించండి. నెంబర్‌ ప్లేట్‌ను కేవలం నెంబర్ల కోసం మాత్రమే ఉపయోగించండి’ అభిమానులని కోరాడు విజయ్.