నిజామాబాద్ లోక్ సభ బరిలో 190మంది రైతులు
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఈ స్థానం నుంచి ఏకంగా 200మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఏకంగా 190మంది రైతులు ఉండటం విశేషం. పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా రైతులు నామినేషన్ల రూపంలో నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 190 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్లు వేశారు.
ప్రధాన పార్టీలైన తెరాస నుంచి కవిత, కాంగ్రెస్ నుంచి మధు యాస్కీగౌడ్, భాజపా నుంచి ధర్మపురి అర్వింద్‌లు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరిని బరిలో నిలిచిన 190మంది రైతులు కలవర పెడుతున్నారు. సాధారణంగా ఒక ఈవీఎంలో 16మంది అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులను ఇచ్చేందుకు అవకాశం ఉంది. 16కంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే రెండో ఈవీఎంను కంట్రోల్ యూనిట్‌కు జత చేస్తారు. చాలా తక్కువ సందర్భాల్లో, కేవలం ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
రెండో ఈవీఎంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ను పూర్తి చేస్తుంది. మరి నిజామాబాద్‌లో బరిలో నిలిచిన 190మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితే ? బ్యాలెట్‌కు వెళ్లాల్సిందే ! ఇందుకు ఏర్పాట్లు చేసేందుకు ఎన్నికల సంఘానికి సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక వాయిదా పడే అవకాశం లేకపోలేదు.