చౌకీదార్ కాదు.. జిమ్మేదారు కావాలి !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చాడు. దూసుకురాలేదు.. తీసుకొచ్చారు. తెరాస నేతలు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసే పని మొదలెట్టారు. అదేలా అంటే.. ? దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. తెలంగాణలో తెరాస 16స్థానాలని గెలుచుకొంటే.. వారికి తోడు మరో 140 మంది ఎంపీలను కేసీఆర్ ఏకం చేస్తారని చెబుతున్నారు. అప్పుడు కేసీఆర్ యే ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఈ దేశానికి కావాల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదని, జిమ్మేదారు మనిషి కావాలన్నారు. దేశానికి మాటల మనిషి కాకుండా కేసీఆర్‌లాంటి చేతల మనిషి కావాలని సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కల్గిన సీఎం అని సర్వేలు చెబుతున్నాయిని తెలిపారు. దిల్లీని శాసించే శక్తిగా తెరాస మారాలన్నారు. పరోక్షంగా కేసీఆర్ ని దేశానికి ప్రధానిని, తనని తెలంగాణకి ముఖ్యమంత్రి చేసేయండని కేటీఆర్ చెబుతున్నట్టుంది. ఏమో అదీ.. జరగొచ్చేమో !