కేటీఆర్‌, హరీశ్‌ పరస్పర సవాల్‌

బావబామ్మర్ధిలు కేటీఆర్-హరీష్ రావుల మధ్య పొలిటికల్ యుద్ధం ఎప్పటికైనా తప్పదనే చర్చ చాన్నాళ్ల నుంచి జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హరీష్ ని సైడ్ చేసి.. కేటీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ప్రయత్నాలు షురు అయ్యాయి. కేటీఆర్ ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయడం, అదే సమయంలో హరీష్ రావుకి మరోసారి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఇందులో భాగమనే చర్చ తెలంగాణ ప్రజల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. కేటీఆర్, హరీష్ పరస్పర సవాళ్లు విసురుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

మెదక్‌లో ఈ నెల 8న నిర్వహించిన సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మెదక్‌ ఎంపీ అభ్యర్థిని రాష్ట్రంలోనే అత్యధిక ఆధిక్యంతో గెలిపించుకొని కేసీఆర్‌కు కానుక ఇస్తామని హరీశ్‌రావు అన్నారు. అదే వేదికపై ఉన్న కేటీఆర్‌ స్పందిస్తూ.. మెదక్‌ కంటే కరీంనగర్‌లో రెండు ఓట్లు ఎక్కువే ఆధిక్యం తెచ్చుకొని తామేంటో చూపిస్తామన్నారు. ఆ సమయంలో బావబామ్మర్థులు ఏదో సరదాగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అందరూ భావించారు. ఇది ఉత్తుత్తి సవాల్ కాదు. చాలా సీరియస్ సవాల్ అని ఇప్పుడు రుజువైంది.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్వహించిన ప్రచార సభలోనూ.. హరీష్ సిద్దిపేటలో అత్యధిక ఆధిక్యం తెచ్చుకోవడంతోపాటు రాష్ట్రంలోనే అధిక ఆధిక్యత ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుంటామంటూ కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరించారు. దీంతో.. హరీష్-కేటీఆర్ పరస్పర మెజారిటీ ఛాలెంజ్ ని విసురుకొన్నట్టయింది. మరీ.. #మెజారిటీఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి.