మన్కడింగ్‌ వివాదం.. వైరల్ !

పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవెన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 13 ఓవర్లలో 108/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.

ఆ ఓవర్‌లో బౌలింగ్‌ చేస్తున్న పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఆఖరి బంతి వేయకముందు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బట్లర్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లాడు. బౌలింగ్‌ చేస్తున్నట్లు అనుకరించి బంతిని వికెట్లకు తాకించి బట్లర్‌ను రనౌట్‌ చేశాడు. దీన్నే మన్కడింగ్‌ అంటారు. ఇప్పుడీ మన్కడింగ్‌ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశ్విన్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని కొందరు క్రికెటర్లు ట్విటర్‌ ద్వారా విమర్శించారు. అలాగే చాలా మంది క్రీడాభిమానులు కూడా అశ్విన్‌ తీరును ఎండగడుతున్నారు.