కారు జోరుకు బ్రేకులు.. మూడు స్ఠానాల్లోనూ ఓటమి !
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు చూపించింది. ఏకంగా 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి నేతల చేరికతో ఆ బలం వందకు చేరుకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగేలా ఉంది. ఆ పార్టీ పెట్టుకొన్న లక్ష్యం 16 ఎంపీ స్థానాలని ఈజీగా చేరుకొనేలా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తెరాకు పెద్ద ఝులక్. శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. తెరాస బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్‌పై ఆయన 39,430 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోటీలో మొత్తం 17 మంది నిలవగా.. మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. చంద్రశేఖర్‌కు 17,268 ఓట్లు రాగా, బీజేపీ బలపరిచిన సుగుణాకర్‌రావుకు 15,077 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. సీపీఎం బలపరిచిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 18,885 ఓట్లు పోలవ్వగా, నర్సిరెడ్డికి 8,976 ఓట్లు.. పూల రవీందర్‌కు 6,279 ఓట్లు పోలయ్యాయి. రవీందర్‌కు టీఆర్ఎస్ మద్ధతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షాలు మద్ధతుగా నిలిచాయి.
కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. ఆయన తెరాస బలపరిచిన అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డిపై విజయం సాధించారు. రఘోత్తంరెడ్డి ఆరో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందడం విశేషం.