రివ్యూ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ – ‘బాబుకి పగిలిపోయింది’ – రేటింగ్ : 3/5

చిత్రం : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ (2019)

నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌.. తదితరులు

సంగీతం : కల్యాణీ మాలిక్‌

దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు

నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

రిలీజ్ డేటు : మార్చి 29, 2019

రేటింగ్ : 3/5

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. ఒక్క లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ తప్ప. లక్ష్మీ పార్వతీ రాకతో ఎన్టీఆర్ జీవితం కీలక మలుపు తిరిగింది. రాజకీయంగా ఓడిపోయారు. వ్యక్తిగతంగా అప్రతిష్టపాలయ్యారు. కుటుంబానికి దూరమై.. ఒంటరి అయ్యాడు. చివరికి మానసిక క్షోభతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఈ పాపంలో చంద్రబాబుది పెద్ద పాత్ర అనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్ చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. తద్వారా తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకొన్నాడు. సీఎం అయ్యాడు.

ఇదంతా అందరికీ తెలిసిందే. ఐతే, లక్ష్మీ పార్వతీ నెపంతో చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎలా వెన్నుపోటు పొడిచాడు. దీనికోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎలా వాడుకొన్నాడు ? ఇంతకీ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతీ ఎలా వచ్చింది ? వీరిమధ్య ప్రేమ ఎలా పుట్టింది.. ? అనే సంచల విషయాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ చూపించిన నిజాలు ఏంటీ.. ? ఆ నిజాలు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాయి?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతీ ఎలా వచ్చింది ? ఆమె ఎన్టీఆర్ కు ఎలా దగ్గరైంది. ఎలాంటి పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతీని ఎన్టీఆర్ పెళ్లి చేసుకొన్నారు. లక్ష్మీ పార్వతీని సాకుగా చూపి.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎలా లాక్కోన్నాడనే సంచలన అంశాలతో పూర్తిగా లక్ష్మీ పార్వతీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్.

ప్లస్ పాయింట్స్ :

* కథనం

* ప్రధాన పాత్రధారుల నటన

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

ఎలా ఉందంటే ?

చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. ఇది అందరు చెప్పుకొనే విషయమే. ఎలా వెన్నుపోటు పొడిచాడు ? అన్నదే ఎవ్వరు కచ్చితంగా చెప్పలేని విషయం. ఆ ప్రయత్నమే చేశాడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు గురించి నిర్థాక్షణ్యంగా నిజాలు చూపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో లక్ష్మీ పార్వతీని వెనుకోసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొదటి భర్త ఉండగానే.. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ ని పెళ్లిచేసుకొన్నా.. ఆమెని వెనుకోసుకొచ్చాడు. ఆమె ఎన్టీఆర్ కు అన్నీ చూసుకొన్నందుకు క్రిడెట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

చంద్రబాబుని మాత్రం అసలు విలన్ ని చేసి చూపించాడు. లక్ష్మీ పార్వతీ పేరు చెప్పి ఎన్టీఆర్ కు ఆయన కుటుంబాన్ని ఏలా దూరం చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి పార్టీని, పదవిని ఎలా లాగేసుకొన్నాడు అనేది తనదైన శైలిలో చూపించాడు. ఆ సన్నివేశాలు చంద్రబాబు వ్యతిరేక వర్గాలని విపరీతంగా ఆకట్టుకొనేలా ఉన్నాయి. బాబు.. తన కుట్రలతో, వెన్నుపోటుతో ఎన్టీఆర్’ని ఎలా దెబ్బతీశాడో.. వర్మ సూటిగా, సుత్తిలేకుండా తెరపై ఆవిష్కరించాడు. నిజాలని నిస్సిగ్గుగా బద్దలు కొట్టాడు వర్మ.

ఎవరెలా చేశారంటే ?

ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ రంగస్థల నటుడు. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా క్షోభకు గురైన సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతం. లక్ష్మీ పార్వతీతో రొమాన్స్ సీన్స్ లో అదరగొట్టాడు. లక్ష్మీపార్వతి పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమా మొత్తానికే హైలెట్. అమాయకత్వం, కల్మశంలేని ప్రేమ, వేదన, అవమాన భారం.. బాధ.. ఇలా అన్ని భావాలను ఆమె అలవోకగా పలికించారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతీ పాత్ర ధారులు ఇద్దరు తమ పాత్రలకి వందశాతం న్యాయం చేశారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ జీవం పోశాడు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

కల్యాణీ మాలిక్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. సెన్సార్ కట్ లో చాలా డైలాగ్స్ కట్స్ పడ్డాయి. ఎడిటింగ్‌ బాగుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఇన్నాళ్లకి లక్ష్మీ పార్వతీకి న్యాయం జరిగింది. ఇన్నాళ్లు ఆమె గోడు ఎవరు ఆలకించలేదు. తొలిసారి రామ్ గోపాల్ వర్మ ఆమె పాత్ర ఆధారంగా ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ తీసుకొచ్చి.. ఆమెని సంతృప్తి పరిచాడు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు సంబంధించి సంచలన విషయాలు చూపాడు. ఫైనల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబు వ్యతిరేకుల కడుపుమంటని తీర్చేలా ఉంది. అదే సమయంలో టీడీపీ, చంద్రబాబు మద్దతుదారుల కడుపుమండేలా ఉందని చెప్పాలి.

రేటింగ్ : 3/5