వర్మ స్వీడుకు సుప్రీం బ్రేకులు

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఈ నెల 29న ఒక్క ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకొంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని విడుదల చేయాలనే కసితో ఉన్నాడు వర్మ. అందుకే ఏపీ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం వర్మ స్వీడుకు బ్రేకులు వేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టేసింది.

ఈ సినిమాపై ఏప్రిల్ 3న ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవలసి ఉంది. అప్పటివరకు ఆగలేరా ? తొందరెందు ?? అంటూ చీవాట్లు పెట్టింది. ఏపీ హైకోర్టు తీర్పు వచ్చాక.. అప్పుడు మీ పిటిషన్ ని పరిశీలించే అవకాశం ఉందని సుప్రీం తెలియజేసింది. ఈ నేపథ్యంలో వర్మ చేసేదేమీ లేదు. ఏప్రిల్ 3న ఏపీ హైకోర్టు తీర్పుని వచ్చేదాక వేచి చూడాల్సిందే.

ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని హైలైట్ చేస్తూ.. లక్ష్మీ పార్వతీ పాత్రపై సానుభూతి కలిగేలా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ ప్రచార అస్త్రంగా ఈ సినిమా అనుకొన్నారు. కానీ, కోర్టు చిక్కులతో వారి లక్ష్యం నెరవేరనట్టయింది.