పవన్ కూడా రెచ్చగొడుతుండు.. !

రెచ్చగొట్టు రాజకీయాలు చేయడం కేసీఆర్, చంద్రబాబులకు మాత్రమే తెలుసు అనుకొన్నాం. ఇప్పుడు వీరిని మించిపోయాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పవన్.. తెలంగాణలో ఆంధ్రా ప్రజలని కొడుతున్నారని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచాడు జనసేనాని. కేసీఆర్‌ వేసే బిస్కెట్‌ కోసం వెళ్తారా.. పులివెందుల పౌరుషం లేదా మీకు… ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్‌షా వద్ద తాకట్టు పెట్టి కాళ్లు పట్టుకుంటారా ? అంటూ జగన్‌పై పవన్‌ విరుచుకుపడ్డారు.

చంద్రబాబుని పవన్ వదల్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడలేని చంద్రబాబు గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం సైకిల్‌ చైన్‌ తెగిపోయిందని, వైకాపా ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోయాయని పవన్ అన్నారు. పశ్చిమగోదావరి
జిల్లా ఆచంట, తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెంలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. జనసేన అధికారంలోకి వస్తే చేయబోయే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి మరోసారి వివరించారు.

జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలతో ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తాం. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి గతంలో ఉన్న పింఛను విధానాన్ని అమలు చేస్తాం. రేషన్‌ బదులుగా మహిళల ఖాతాకు రూ.2500 నుంచి 3000 వరకూ జమచేస్తాం. 60సంవత్సరాలు నిండిన రైతన్నలకు నెలకు రూ.5వేల పింఛను అందిస్తాం. 3 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.